శ్రీమద్రామాయణ అంతర్గతమయిన ఆదిత్య హృదయం సూర్యదేవత స్తోత్రంగా ప్రసిధ్ధి పొందింది. రామాయణం యుధ్ధ కాండలో రావణునితో యుధ్ధానికి సిధ్ధమవుతున్న శ్రీరామచంద్రునికి అగస్త్య మహాముని ఈ స్త్రోత్రాన్ని బోధించినట్టు ప్రతీతి.
ఈ స్త్రోత్రాన్ని పఠించేవారికి ఆయురారోగ్యాభివృధ్ధి, శత్రునాశనం కలుగుతుందని విశ్వాసం.
ఆదిత్య హృదయం వేద మంత్రం కాదు, స్మృతి, దీనిని చదవటానికి ఎలాంటి రాగాలు, చందస్సు ప్రకారం చదవాల్సిన అవసరం లేదు, ఎప్పుడయినా, ఎలాంటి పరిస్థితిలో అయినా అనగా స్నానం చేసిన, చెయ్యకున్నా, మాసిన బట్టలతో అయినా ఎలా అయిన చదువుకోవచ్చు.
రోజూ ఆదిత్య హృదయ పారాయణ వలన విశేశ లాభములు కలుగుతాయని ప్రతీతి.
ఆదిత్య హృదయ స్తోత్రం
1. తతో యుద్ధపరిశ్రాస్తం సమరే చిన్తయాస్థితమ్
రావణం చాగ్రతో దృష్ట్వా యుధ్ధాయ సముపస్థితమ్ ||
2. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్
ఉపాగమ్యా బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషి: ||
3. రామరామ మహాబాహో శ్రుణు గుహ్యం సనాతనమ్
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ||
4. ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనమ్
జయావహం జపేన్నిత్య మక్ష్యయ్యం పరమం శివమ్ ||
5. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనమ్
చిన్తాశోక ప్రశమన మాయుర్వర్ధన ముత్తమమ్ ||
6. రశ్మిమంతం సముద్యన్తం దేవాసుర నమస్కృతమ్
పూజయస్వ వివస్వన్తం భాస్కరం భువనేశ్వరమ్ ||
7. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావన:
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి: ||
8. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ: స్కన్ద: ప్రజాపతి:
మహేన్ధ్రోధనద: కాలో యమ స్సోమో హ్యపాం పతి: ||
9. పితరో వసవ స్సాధ్యా హ్యశ్వినౌ మరుతో మను:
వాయుర్వహ్ని: ప్రజాప్రాణా ఋతుకర్తా ప్రభాకర: ||
10.ఆదిత్య: సవితా సూర్య: ఖగ: పూషా గభస్తిమాన్
సువర్ణ సదృశో భాను ర్హిరణ్యరేతా దివాకర: ||
11.హరిదశ్వ: సహస్రార్చి స్సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మధనశ్శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ ||
12.హిరణ్యగర్భ శ్శిశిర స్తపనో భాస్కరో రవి:
అగ్నిగర్భో దితే: పుత్ర: శంఖ శ్శిశిరనాశన: ||
13.వ్యోమనాధ స్తమోభేదీ ఋగ్యజుస్సామ పారగ:
ఘనవృష్టి రపాం మిత్రో వింధ్యవీధీప్లవంగమ: ||
14.ఆతపీ మండలీ మృత్యు: పింగళ స్సర్వతాపన:
కవి ర్విశ్వో మహాతేజా రక్త: సర్వ భవోద్భవ: ||
15.నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వభావన:
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మ న్నమోస్తుతే ||
16.నమ: పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ:
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ: ||
17.జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ:
నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ: ||
18.నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ:
నమ: పద్మ ప్రబోధాయ మార్తండాయ నమో నమ: ||
19.బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ: ||
20.తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ: ||
21.తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ||
22.నాశయత్యేషవై భూతం తమేవ సృజతి ప్రభు:
పాయత్యేష తప త్యేష వర్ష త్యేష గభ స్తిభి: ||
23.ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత:
ఏషచై వాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ ||
24.వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి: ప్రభు: ||
25.ఏనమాపత్సు కృచ్చ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుష: కశ్చిన్నావసీదతి రాఘవ: ||
26.పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏత త్త్రిగుణితం జప్త్వా యుద్దేషు విజయిష్యసి ||
27.ఆస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యధాగతమ్ ||
28.ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవ: ప్రయతాత్మవాన్ ||
29.ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్ష మవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ||
30.రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుధ్ధాయ సముపాగతమ్
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్ ||
31.అధ రవి రవద న్నిరీక్ష్యరామం
ముదితమనా: పరమం ప్రహృష్యమాణ:
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి ||
తాత్పర్యం [అర్థం]
ఆదిత్య హృదయం లోని మొదటి రెండు శ్లోకాలు అగస్త్యుడు శ్రీరాముని వద్దకు రావటం గురించి.
1. తతో యుద్ధపరిశ్రాస్తం సమరే చిన్తయాస్థితమ్
రావణం చాగ్రతో దృష్ట్వా యుధ్ధాయ సముపస్థితమ్ ||
2. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్
ఉపాగమ్యా బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషి: ||
రామ రావణ యుధ్ధాన్ని చూడటానికి వచ్చిన వారిలో ఒకరయిన అగస్త్య మహాముని , రావణున్ని ఎలా వధించాలని ఆలోచిస్తున్న రాముడిని సమీపించి ఇలా పలికాడు.
3,4,5 శ్లోకాలు ఆదిత్య హృదయ పారాయణ గొప్పతనం గురించి వివరిస్తాయి
3. రామరామ మహాబాహో శ్రుణు గుహ్యం సనాతనమ్
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ||
4. ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనమ్
జయావహం జపేన్నిత్య మక్ష్యయ్యం పరమం శివమ్ ||
5. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనమ్
చిన్తాశోక ప్రశమన మాయుర్వర్ధన ముత్తమమ్ ||
ఓ రామా, మహా బాహా, నీకొక రహస్యాన్ని చెపుతాను విను, ఈ రహస్యం వలన నీ శత్రువులందరినీ జయించగలవు. ఆదిత్య హృదయం అనే స్తోత్రం పరమ పావన మయినది, శత్రు నాశకమయినది, భయాన్ని పోగొట్టేది, జయాన్ని కలిగించేది, శోకాలని నివారించేది, ఉత్తమోత్తమమయినది దానిని జపించాలి.
6 నుండి 15 వరకు శ్లోకాలు సూర్య స్వరూపముని గురించి వివరిస్తాయి.
6. రశ్మిమంతం సముద్యన్తం దేవాసుర నమస్కృతమ్
పూజయస్వ వివస్వన్తం భాస్కరం భువనేశ్వరమ్ ||
బంగారు కిరణాలు కలవాడు, లోకములకు వెలుగునిచ్చేవాడు, దెవతలు , రాక్షసులు నమస్కరించువాడు అయిన ఆదిత్యుడిని [ సూర్యుడిని ] పూజించు.
7. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావన:
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి: ||
సమస్త దేవతలకు ఆత్మ అయినవాడు, తేజము కలవాడు, తన కాంతితో లోకములను ప్రకాశింపచేసేవాడు, దేవతలను , అసురులను తన కాంతి తో కాపాడేవాడు.
8. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ: స్కన్ద: ప్రజాపతి:
మహేన్ధ్రోధనద: కాలో యమ స్సోమో హ్యపాం పతి: ||
బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కందుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, యముడు, చంద్రుడు, వరుణుడు అన్ని ఆదిత్యుడే. ఆదిత్యుడు సమస్త దేవతలకి ఆత్మ అని భావం.
9. పితరో వసవ స్సాధ్యా హ్యశ్వినౌ మరుతో మను:
వాయుర్వహ్ని: ప్రజాప్రాణా ఋతుకర్తా ప్రభాకర: ||
పిత్రు దేవతలువసువులు,అశ్వనీ దేవతలు, మనువు, వాయువు, అగ్ని అన్నీ ఆదిత్యుడే, అన్ని స్వరూపములు ఆదిత్యుడివే, ఋతువులకి కారణం ఆదిత్యుడే.
10.ఆదిత్య: సవితా సూర్య: ఖగ: పూషా గభస్తిమాన్
సువర్ణ సదృశో భాను ర్హిరణ్యరేతా దివాకర: ||
ఆదిత్యుడు సృష్టికి కారకుడు, లోకాన జనులకు కర్మలలో ప్రోత్సహించేవాడు, వర్షం ద్వార జగత్తుని పోషించేవాడు,బంగారు రంగు కిరణాలు కలవాడు.
11.హరిదశ్వ: సహస్రార్చి స్సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మధనశ్శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ ||
పచ్చ రంగు వయిన ఏడు గుర్రాలను కలిగిన వాడు, వేయి కిరణాలు ఉన్నవాడు, చీకటిని నశింపచేసేవాడు, సుఖాన్ని కలిగించేవాడు , ప్రపంచాన్ని అంతటికీ వ్యాపించేవాడు, నిరంతరము తన కిరణాలతో ప్రకాశించేవాడు.
12.హిరణ్యగర్భ శ్శిశిర స్తపనో భాస్కరో రవి:
అగ్నిగర్భో దితే: పుత్ర: శంఖ శ్శిశిరనాశన: ||
బ్రహ్మాండాన్ని , అగ్నిని గర్భంలో కలవాడు, సాయంకాళం శాంతించువాడు, తాపత్రయములని తొలగించి శాంతిని ప్రసాదించువాడు, మంచుని పోగొట్టువాడు, దివ్యమయిన వెలుగు కలవాడు,అదితి పుత్రుడు.
13.వ్యోమనాధ స్తమోభేదీ ఋగ్యజుస్సామ పారగ:
ఘనవృష్టి రపాం మిత్రో వింధ్యవీధీప్లవంగమ: ||
ఆకాశానికి అధిపతి, చీకటిని పోగొట్టేవాడు, ఋగ్యజుస్సామ వేద పారంగతుడు, అధికమయిన వర్షాన్ని కురిపించేవాడు, వింధ్య వీధిలో [ఆకాశములో] వేగంగా పయనించగలవాడు.
14.ఆతపీ మండలీ మృత్యు: పింగళ స్సర్వతాపన:
కవి ర్విశ్వో మహాతేజా రక్త: సర్వ భవోద్భవ: ||
వేడిని కలిగించేవాడు, గుండ్రని రూపం కలవాడు, మృత్యు స్వరూపము కలవాడవు [శత్రువులని రూపుమాపేవాడు], విశ్వాన్ని నడిపేవాడు, ఉదయమున ఎరుపు రంగు కలవాడు, మధ్యానం సమస్త ప్రాణులని తపింపచేయువాడు, మహా తేజస్వి, కవి, సర్వ నిర్వాహకుడు, అందరి కర్మలకి కారనభూతమయినవాడు.
15.నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వభావన:
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మ న్నమోస్తుతే ||
నక్షత్రాలకి, గ్రహాలకి, తారలకి అధిపతి, విశ్వము అనేభావనకి కారకుడు. అగ్ని ఇత్యాది తేజస్సులకన్నా తేజస్సు కలవాడు. పన్నెండు రూపములతో [ ఇంద్రుడు, ధాత, భృగువు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, అర్యముడు, అర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, నవిత, విష్ణువు] ప్రసిధ్ధికెక్కిన సూర్య భగవానుడా నీకు నమస్కారం.
16 నుండి 20 వరకు మంత్ర జపం
16.నమ: పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ:
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ: ||
తూర్పు , పడమర కొండలయందు విలసిల్లే నీకు నమస్కారం, నక్షత్రాలు, గ్రహాలు, దినరాత్రులకి అధిపతివి అయిన సూర్య భగవానుడా నీకు నమస్కారం.
17.జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ:
నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ: ||
విజయాన్ని, శుభముని కలిగించే వాడవు, పచ్చని గుర్రాలు కల వాడవు, వేయి కిరణములని కలవాడవు, అదితి పుత్రుడవి అయిన సూర్య భగవానుడా నీకు నమస్కారం.
18.నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ:
నమ: పద్మ ప్రబోధాయ మార్తండాయ నమో నమ: ||
ఉగ్రుడవు, వీరుడవు, వేగంగా ప్రయాణించేవాడవు అయిన సూర్య భగవానుడా నీకు నమస్కారం. పద్మాలని వికసింపచేసేవాడవు , ప్రళయానంతరం పున: సృష్టి కి కారణం అయిన వాడవి అయిన సూర్య భగవానుడా నీకు నమస్కారం.
19.బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ: ||
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి ప్రతీకవి, దివ్య తేజస్సు కలవాడవి, లయకారకుడవి అందువలన రుద్ర స్వరూపమయిన సూర్య భగవానుడా నీకు నమస్కారం.
20.తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ: ||
చీకటిని, మంచుని పోగొట్టేవాడివి, నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులని సంహరించేవాడివి , అమిత తేజస్సు కలవాడివి , జ్యోతిర్గణములకి అధిపతివి అయిన సూర్య భగవానుడా నీకు నమస్కారం.
21 నుండి 24 శ్లోకాలు సూర్యుడి వర్ణన
21.తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ||
బంగారపు వన్నె కలవాడవు, అగ్ని రూపు కలవాడవు, విశ్వమందలి జనాల కర్మలకి కారణమయిన వాడవు, చీకటికి పోగొట్టేవాడవు, లోక సాక్షివి అయిన సూర్య భగవానుడా నీకు నమస్కారం.
22.నాశయత్యేషవై భూతం తమేవ సృజతి ప్రభు:
పాయత్యేష తప త్యేష వర్ష త్యేష గభ స్తిభి: ||
జగత్తుని నశింపచేయగలవాడు, తిరిగి సృష్టించగలవాడు, తన వేడిమి చేత జగత్తుని తపింపచేస్తాడు, తిరిగి తనే వర్షాన్ని ప్రసాదిస్తాడు.
23.ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత:
ఏషచై వాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ ||
సకల ఫ్రాణకోటిలో ఉండేవాడు, వారు నిద్రిస్తున్నా ఇతడు మెలకువగానే ఉంటాడు, అగ్నిహోత్రం ఇతడే, అగ్నిహోత్ర అర్చనా ఫలం ఇతడే.
24.వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి: ప్రభు: ||
వేదాలకు, క్రతువులకి, క్రతువుల ఫలానికి [ యఙ్ణ యాగాదులకి వాటి ఫలితాలకి], లోకాన జరిగే సమస్త కార్యాలకి సూర్యుడే ప్రభువు.
25 వ శ్లోకం నుండిపారాయణ విధానం గురించి, పారాయణ ఫలితం గురించి, చివరి శ్లోకం సూర్య భగవానుడు శ్రీరాముడిని విజయం పొందేలా ఆశీర్వదించే శ్లోకం.
25.ఏనమాపత్సు కృచ్చ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుష: కశ్చిన్నావసీదతి రాఘవ: ||
ఆపదలందు,కష్టాలలో, భయ సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠిస్తే ఆ ఆపదలనుండి బయటపడవచ్చు.
26.పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏత త్త్రిగుణితం జప్త్వా యుద్దేషు విజయిష్యసి ||
ఓ రామా! దేవదేవుడూ, జగత్ప్పతి అయిన సూర్యుడిని నీవు ఏకాగ్రతతో పూజించు, ఈ ఆదిత్య హృదయాన్ని ముమ్మార్లు జపించు, నీకు యుద్దంలో తప్పక విజయం కలుగుతుంది.
27.ఆస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యధాగతమ్ ||
రామా! మహా బాహా! నీవు ఇలా చేసినచో ఈ క్షణముననే రావణుని వధించగలవు అని చెప్పి అగస్త్య మహా ముని తను వచ్చిన దారినే వెళ్లిపోయాడు.
28.ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవ: ప్రయతాత్మవాన్ ||
మహా తేజస్సు కల శ్రీరాముడు చింతను వీడి ఏకాగ్రతతో ఈ స్తోత్రాన్ని జపించటానికి సిద్దమయ్యెను.
29.ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్ష మవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ||
శ్రీరాముడు ఆచమనం చేసి, శుచియయి, సూర్యుడిని చూస్తూ మూడు సార్లు ఆదిత్య హృదయముని పఠించి సంతుష్టుడయి తన వింటిని చేపట్టెను.
30.రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుధ్ధాయ సముపాగతమ్
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్ ||
సంతుష్టుడయిఉన్న శ్రీరాముడు, రావణున్ని చూచి అతడిని చంపడానికి కృతనిశ్చయుడయి అతనితో యుద్దానికి అతడిని సమీపించెను.
31.అధ రవి రవద న్నిరీక్ష్యరామం
ముదితమనా: పరమం ప్రహృష్యమాణ:
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి ||
దేవతల మధ్యలో కల సూర్య భగవానుడు మిక్కిలి సంతసించి, రావణుడు నశించుట తథ్యమని తెలిసి 'ఓ రామా! నీవు ఆలస్యం చేయకు, త్వరపడు అని పలికెను '.