ఈరోజు మనం సిద్దిపేట కి దగ్గర ఉన్న చుంచనకోట అనే ఊరిలో పూజలు అందుకుంటున్న భువనేశ్వరి మాత ఆలయం గురించి, స్థల విశేషం గురించి తెలుసుకుందాము.
చుంచనకోట గ్రామం సిద్దిపేట కి దగ్గరలో గల చేరియాల్ మండలానికి 7 కిలోమీటర్ల దూరం, సిద్దిపేట 30 కిలోమీటర్ల దూరం.
సిద్దిపేట కి దగ్గర లో ఉన్న గజవెల్లి అనే గ్రామంలో చంద్రమౌళి శాస్త్రి గారు ఉండేవారు, వారు సంసారిక జగత్తు మీద విరక్తి తో భగవంతునకి సేవలో జీవితాన్ని గడపాలనే తలంపుతో గురువు ల అనుగ్రహం కోసం మరుకూపు ఆశ్రమంలో నారాయణ బాబా గారి వద్ద సేవ చేస్తూ భగవంతుని సేవ గురువుగారి సేవ చేస్తూ కాలం గడిపుతున్న సమయంలో, ఆయనకి ప్రశాంతత లేక ఇంకా సంతృప్తి కలగక గురువుగారికి తన వేదన విన్నవించుకున్నారు.
గురువు గారు చంద్రమౌళి శాస్త్రి గారిని, చాలా దూరంగా తనకి నచ్చిన వైపు నడిచి మొదటిగా వచ్చిన మలుపు వైపుకి తిరిగి వెళ్ళమని , శాస్త్రి గారికి తన జీవిత లక్ష్యం ఆ ప్రయాణంలో తెలుస్తుందని చెప్పారు.
గురువు గారి ఆదేశం మేరకు చంద్రమౌళి శాస్త్రి గారు నడక మొదలుపెట్టారు , మొదటి మలుపు తిరిగి నడక మొదలు పెట్టిన తరవాత ఆయనకి ఒక ముసలామె కనిపించి , తనని దగ్గరలో ఉన్న గుట్ట దగ్గరకి తీసుకెళ్లమని అడిగింది.
వాళ్లు ఇద్దరూ గుట్ట దగ్గరకి చేరుకుంటున్న సమయంలో ఆ ముసలావిడ అదృశ్యం అయిపోయింది, ఆ గుట్టకి దగ్గర ఉన్న గ్రామం చుంచనకోట.
ఆ ముసలావిడ కనిపించకపోవటం తో ఆశ్చర్య పడిన శాస్త్రి గారు ఆమె ఊరిలోని ఎవరి ఇంటికయినా వెళ్ళిందేమో అనే అనుమానంతో ఆ చిన్న ఊరిలో ని వాళ్లని అడిగారు, కాని ఎవరూ ఆ ముసలవిడ గురించి తెలియదని చెప్పారు.
ఆ ముసలావిడ కనిపించకపోవడంతో నిరాశపడిన శాస్త్రి గారు ఎలాగయినా ఆమె గురించి తెలుసుకునేవరకి ఆ గ్రామాన్ని విడవరాదనే ఆలోచనతో ఆ ఊరిలో నివాసం ఉంటున్న సీతారామ శాస్త్రి, నరసమ్మ దంపతుల ఇంటిలో ఉండసాగాడు, పిల్లలు లేని ఆ దంపతులు శాస్త్రి గారిని వాళ్ల కొడుకు లాగే చూసుకోసాగారు.
చంద్రమౌళి శాస్త్రి గారికి ఒక రోజు కలలో తను చూసిన ముసలావిడ అమ్మవారి రూపంలో కనిపించి, తను ఆ ఊరిలో ఉండేలా ఏర్పాట్లు చెయ్యమని ఆదేశించింది.
కల నుండి మేల్కొన్న శాస్త్రి గారు, అమ్మవారికి ఆ ఊరిలో గుడి కడతానని శపధం చేసుకున్నారు.
కానీ శాస్త్రి గారి వద్ద డబ్బులు లేవు, తనకి ఆశ్రయం ఇస్తున్నది కూడా పేద కుటుంబమే, అయినా పట్టు వదలకుండా శాస్త్రి గారు డబ్బు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు, చుంచనకోట గ్రామస్తులనుండి కొంత సహకారం లభించింది, శాస్త్రి గారు ఆశ్రమంలో ని వారికి, తన మిత్రులకు ఉత్తరాలు రాసి సహాయం అడిగారు, మొత్తానికి శాస్త్రి గారికి కాలసిన డబ్బు సమకూరింది.
రాజస్తాన్ లో మార్బుల్ రాయి తో విగ్రహాలని చేస్తారన్న ఒక మిత్రుడి సలహాతో శాస్త్రి గారు రాజస్తాన్ వెళ్ళి దేవీ ప్రతిమని చేయించి తీసుకువచ్చారు. మొత్తానికి దిగ్విజయంగా దీవి కి గుడి కట్టి ఆ ప్రతిమని శ్రీ చక్రం మీద ప్రతిష్టించి "దేవి భువనేశ్వరి" గా ఆరాధించటం మొదలుపెట్టారు.
దేవి పూజకి నియమాలని ఏర్పాటు చేసి , నియమాలకి అనుగూనంగా నిత్యపూజలని ప్రారంభించారు.
శాస్త్రి గారు శంకర నారాయణ అనే కుర్రవాడిని దత్తత తీసుకుని, విద్యా బుద్దులు పూజా పునస్కారాలు నేర్పించి నిత్య పూజ నియమాలని నేర్పించారు, శాస్త్రి గారి తరవాత శంకర నారాయణ గారి సంతతి దేవి సేవ చేస్తున్నారు.
ప్రతి సంవత్సరం జనవరి-ఫిబ్రవరి నెలలలో భువనేశ్వరి మాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి, భక్తులు చుట్టుపక్కల గ్రామాలనుండి పెద్ద సంఖ్యలో ఆ ఉత్సవాలలో పాల్గొంటారు.
నవరాత్రులలో
- మొదటి రోజు కలశ స్థాపన
- రెండవ రోజు కుంకుమార్చన పూజ
- మూడవ రోజు చండి హవనం
- నాలుగవ రోజు పుష్పార్చన
- అయిదవ రోజు రుద్రాభిషేకం
- ఆరవ రోజున మహా లింగార్చన పూజ , పూర్ణాహుతి
- ఏడవరోజున సత్యనారాయణ స్వామి పూజ
- ఎనమిదవ రోజున కలశ ఉద్వాసన, పల్లకి సేవ
- తొమ్మిదవ రోజున నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.
|| శ్రీ మాత్రే నమ: ||