అమ్మ, ఆవు, జన్మభూమి, మాతృభాష పూజ్యనీయమయినవి , మరచిపోకూడనివి.
మన వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలలో గోవును మాతగా స్తుతించారు. "గావో విశ్వస్య మాతర:" అనగా గోవు విశ్వానికి మాతృమూర్తి అని చెప్పబడినది. గోవు పాలు, పెరుగు, నెయ్యి , మూత్రము, పేడ శ్రేష్టమయినవి. దేశీయ గోవు పేడ, మూత్రము ఆర్గానిక్ ఫార్మింగ్ లో వాడటం తెలిసిందే.
గో క్షీరము
ఆవు పాలు సర్వశ్రేష్టమయిన పోషకాహారము. రోగనిరోధక శక్తిని పెంచి, సర్వ రోగాలను నివారించి వృద్దాప్యాన్ని దూరం చేస్తాయి, ఉదర సంబంధమయిన వ్యాధులను తగ్గించి ప్రేగులలోని క్రిములను నశింపచేస్తాయి.
శరీర పోషణకు అవసరమయిన తత్వాలన్నీ పాలలో కలవు, రోజూ ఆవు పాలు సేవించువారు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారని పెద్దలు చెపుతారు.
మజ్జిగ
ఆవు పాలతో తయారయిన మజ్జిగ సేవించువారు వ్యాధులకు గురికారు. అనారోగ్యంతో వున్నవారు సేవించినచో వ్యాధి పెరగదు, క్రమక్రమముగా వ్యాధి తగ్గగలదు, మజ్జిగలో వాత, పిత్త, శ్లేష్మాదులను క్రమపరచి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చు శక్తి కలదు.
ఆవు నెయ్యి
అత్యంత అధ్భుతమయిన ఔషధగుణములు కలది, మేధాశక్తిని పెంచి విషతుల్యమయిన మలినములని తొలగించి మంచి ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి వ్యాధి కారక క్రిములని నశింపచేస్తుంది.
గోమయము [ఆవు పేడ]
నిజానికి భూమాతకు తల్లి గోమాతయే అని చెప్పవచ్చు, అనాదిగా ఆవుపేడ, ఆవు మూత్రముతో భూమి సస్యశ్యామలంగా ఉండేది. ప్రస్తుతం రసాయన ఎరువుల వాడకం వలన భూమి బంజరు భూమిగా మారే ప్రమాదం ఉన్నది. ఆవు నుండి లభించే పంచ గవ్యములను ఉపయోగించి పండించే పంటలు అమృతతుల్యముగా ఉంటాయి, మరియూ భూమిని సారవంతముగా చేస్తాయి.
గోవులు ప్రకృతి మనకు ప్రసాదించిన వరం, మీకు వీలు ఉంటే గో సంరక్షణ చేయండి, లేదా చేసే వాళ్లకి సహాయం చేయండి.