శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజంబటంచున్
ప్రభాతంబు సాయంత్రమున్నీదు సంకీర్తనల్ చేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకంబొక్కటిం
బాగ నూహించి నీ మూర్తినిం గాంచి నీ సుందరంబెంచి
నీ దాస దాసుండనై రామ భక్తుండనై
నిన్ను నే గొల్చెదన్ నిన్ను నేనెంచదన్
నీకటాక్షంబునన్ జూడుమా వేడుకల్ జేయుమా
నా మొరాలించుమా నన్ను రక్షించుమా
అంజనాదేవి గర్భోదయాదేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై చూడుమా దాతవై బ్రోవుమా దగ్గరన్ నిల్చుమా
తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కార్యంబు నందుండి
శ్రీ రామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు పూజించి ఆ భానునిం బంటు గావించి
ఆ వాలినిన్ జంపి కాకుత్థ్ప వర్యుం దయాదృష్టి వీక్షించి
కిష్కింధ నేలించి శ్రీ రామ కార్యార్థివై
లంక కేతించియున్ లంకినిన్ జంపియున్
లంకనున్ గాల్చియున్ భూమిజం చూచి యానందముప్పొంగి
యా యుంగరంబిచ్చి యారత్నముందెచ్చి
శ్రీ రామ సంతోషితుంజేసి సుగ్రీవునిన్ జాంబవంతుం నలుం నీలున్ అంగదున్ కూడియున్
సేతువున్ దాటి కీశౌఘసంఘంబుచే
దైత్యులం ద్రుంచగా రావణుండంత కాలాగ్నియై యుగ్రుడైపోరి
బ్రహ్మాండ మైనట్టి యాశక్తినిన్ వైచి సౌమిత్రినిన్ మూర్చనొందింపగా
నప్పుడేపోయి సంజీవినిన్ దెచ్చి రామానుజు ప్రాణముల్ రక్ష కావించియున్
కుంభకర్ణాది వీరాధివీరులున్ మరింబోర
శ్రీరాముబాణాగ్ని వారందరున్ రావణుంగూడ జంపంగా
లోకంబులానందమైయుండ యవ్వేళ లందున్
సురారిం మరిం వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి
సీతా మహాదేవినిందెచ్చి శ్రీరామునకున్ ఇచ్చి
అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబనేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ కూర్మి లేరంచు
మన్నించినన్ రామభక్త ప్రశస్తంబుగా
నిన్ను నీ నామసంకీర్తనల్ జేసినన్
పాపముల్ బాయునే భీతియున్ దీరునే
భాగ్యముల్ కల్గునే సర్వసామ్రాజ్యముల్
సర్వసంపత్తులున్ కల్గునే వానరాకార యో భక్త మందార
యో పుణ్యసంచార యో ధీర యో వీర నీవే సమస్తంబు
మహావీరుడవే మహాశక్తివై తారకబ్రహ్మమంత్ర
స్మృతింజేసి స్థైర్యమ్ముగా శుభ్రదేహమ్మునుం దాల్చి
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంచున్ మన:పూరమై
యెప్పుడుం దప్పకన్ దల్చు నాజిహ్వయందుండి
నీ దీర్ఘ దేహంబునన్ లోకసంచారివై
రామనామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబునన్
రౌద్రనీ జ్వాల కల్లోల యోవీర యోధీర ఓంకార ఓంకార ఓంకార శబ్దంబులన్
భూత పైశాచిక శాకినీ డాకినీ గాలిదయ్యంబులన్
నీదువాలంబునన్ జుట్టి నేలం బడంగొట్టి నీ ముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్
రోమ ఖండంబునన్ ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై
బ్రహ్మతేజ ప్రభాసితంబైన నీదివ్య తేజంబునుం జూచి
రారా నృసింహ యటంచున్ దయాదృష్టి వీక్షించి
నన్నేలు స్వామి! నమస్తే సదా బ్రహ్మచారి!
నమస్తే మహా వాయుపుత్రా!
నమస్తే నమస్తే నమస్తే! నమో నమ: