ఒక యోగి ఆత్మకథ పుస్తకం ఒక ఆధ్యాత్మిక భాండాగారం, 1893 జనవరి 5 న గోరఖ్ పూర్ లో జన్మించిన ముకుంద లాల్ ఘోష్ ఆధ్యాత్మికత వైపుగా ఆకర్షితమయి తన ఆధ్యాత్మిక ప్రయాణంలో సరయిన గురువు కోసం వెతికే ప్రయత్నంలో చిన్న వయసులోనే గొప్ప యోగులని కలిసి అధ్బుతమయిన ఆధ్యాత్మిక అనుభవాలను పొందారు.
మహానుభావుడు యుక్తేశ్వర్ గిరి గారిని కలవటం, ఆయన దగ్గర శిష్యుడిగా చేరి పది సంవత్సరాల ఆశ్రమ జీవితం తరవాత ముకుంద లాల్ ఘోష్ స్వామి యోగానంద గా మారి తన గురువు ఆజ్ఞ తో అమెరికా వెళ్లి యోగ విద్యని ప్రపంచానికి అందించారు.
పాశ్చ్యాత్య దేశాలలో భారతీయ సంసృతి సాంప్రదాయాలని పరిచ్హహయం చేసి గౌరవాన్ని పెంచిన స్వామి వివేకానంద తరవాత అంతగా భారతీయ ఆధ్యాత్మికత, యోగాని ప్రచారం చేసిన వారు పరమహంస యోగానంద.
పరమహంస యోగానంద జీవితకాలం 1893-1952, ఈయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలలో ఒకరు, ఈయన జీవితంలో ఎంతోమంది సాధువులని, మర్మ యోగులని, గురువులనీ కలిసారు. 1920 లో గురు ఆజ్ఞ ప్రకారం అమెరికా వెళ్లి ధ్యానం, ఆధ్యాత్మిక జీవితం, యోగ శాస్త్ర జ్ఞానాన్ని వందల వేల పురుషులకి, స్త్రీలకి అందించారు.
మనం చదివే పుస్తకాలలో వినోదాన్ని అందించేవి, కొత్త విషయాలని బోధించేవి, మనల్ని మెరుగు పరచేవి ఉంటాయి కదా, ఒక యోగి ఆత్మకథ పుస్తకం ఈ మూడింటినీ అందిస్తుంది. ఈ పుస్తకం 1999 లో 20 వ శతాబ్దపు 100 ఉత్తమ ఆధ్యాత్మిక పుస్తకాలలో ఒకటిగా ఎంపికయింది, 50 కి పైగా భాషలలోకి అనువదించబడింది.
ఈ పుస్తకంలో రమణ మహర్షి, మాతా ఆనందమయి, మహాత్మాగాంధీ, రవీంద్రనాధ్ ఠాగూర్, జగదీష్ చంద్రబోస్, సి.వి.రామన్ మొదలయిన వారితో పరమహంస యోగానంద గడిపిన ముఖ్య ఘట్టాలు వివరించబడ్దాయి.
భారతదేశం గర్వించదగిన గొప్ప సాధు యోగులయిన మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయులు, ముక్తేశ్వర గిరి, రమణ మహర్షి, నిర్మలా మాయి ల గురించి పరిచయం చేస్తుంది, అలాగే క్రమశిక్షణతో ఎలా సన్మార్గంలో పయనించాలో, ఆరోగ్యకరమయిన ఆలోచనలు ఆరోగ్యవంతమయిన జీవితాన్ని ఎలా అందిస్తాయో, ధ్యాన సాధన ద్వారా మనస్సుకి ఎలా కళ్ళెం వేయవచ్చో తెలుపుతుంది.
ఎక్కడో గోరఖ్ పూర్ లో జన్మించిన ముకుంద లాల్ ఘోష్ స్వామి యోగానంద గా, తరవాత పరమహంస యోగానంద గా మారటం, పాశ్చ్యాత్య దేశాలకు యోగా ని విస్తరించిన మార్గదర్శకుడిగా ఎలా మారాడో ఈ పుస్తకం లో తెలుసుకోవచ్చు.
- తల్లి చాటు బిడ్ద, అన్న చాటు తమ్ముడు, తండ్రి అంటే భయపడే కొడుకు ఆత్మ సాధన వైపుగా ప్రేమని పెంచుకుని, అతని మిత్రుడితో పారిపోవడం, దొరికి పోయి ఇంటికి రావటం.
- గాలిలో నడిచే సాధువు.
- బృందావనానికి వెళ్లి దేవుడికే పరీక్ష పెట్టి భోజనం సంపాదించటం.
- నిద్ర పోని సాధువు మజుందార్.
- సూర్యరశ్మిని మాత్రమే ఆహారంగా స్వీకరించే స్వామిని.
ఇలాంటి అధ్బుత లీలలు ఎన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి.
ఈ పుస్తకం మతం లేదా దేవునికి సంబంధించిన విషయాలకన్నా వ్యక్తి యొక్క సామర్ధ్యాన్ని వివరిస్తూంది, పుస్తకం లోని భాష చాలా సరళం గా ఉంటుంది, ఎక్కడ కూడా నేను అధ్బుతాలు చేసాను మహిమలు చేసాను అని చెప్పకుండా సహజంగా జరిగిన సంఘటనలు వివరించటం జరిగింది, అందుకే ఈ పుస్తకం ఆధ్యాత్మిక ప్రపంచంలో గొప్ప రచనగా పరిగణింపబడుతోంది.