భానువంశమునందు ప్రభుడవై జన్మించి
అఖిలవిద్యలనెల్ల నభ్యసించి
తాటకి మర్ధించి తపసియాగము గాచి
శిలను శాపముమాన్పి స్త్రీని జేసి
శివుని చాపము విరచి సీతను పెండ్లాడి
పరశురాముని త్రాణ భంగపరచి
తండ్రి వాక్యము కొరకు తమ్మునితోగూడి
వైదేహి తోడను వనముకరగి
ఖరదూషణాదుల ఖండించి రాక్షస
మారీచ మృగముల మడియజేసి
లంకకురాజైన రావణాసురుడొచ్చి
సతిగొని పోవంగ సంభ్రముడిగి
సుగ్రీవు గనుగొని సుముఖుడై యప్పుడు
వాలిని వధియించి వరుసతోడ
రాజ్య మాతనికిచ్చి రాజుగా చేబట్టి
కిష్కింధ యేలించి కీర్తివడసి
వాయుసుతుచేత జానకి వార్త దెలసి
తర్లి సేతువు బంధించి త్వరగదాటి
రావణానుజు కభయంబు రయమునొసగి
ఘోర రణమందు రావణు గూలనేసి
అతని తమ్ముని రాజుగా నమరజేసి
సతినిచేకొని సురలెల్ల సన్నుతింప
రాజ్యమేలితివి పట్టాభిరామువగుచు
రామ తారక దశరథ రాజతనయ.